శ్రీసాయిసందేశామృతము : 20 (Nectar of Sri Sai's message 20).
శ్రీసాయినాథాయనమః ! సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము,20. బాబా బోధనమార్గములు బహుళము . ఈఅధ్యాయవిషయము, భక్తుడు దాసగణుమహారాజ్ కు కలిగిన సందేహానికి బాబా యందించిన చక్కని సందేశము . ముఖ్యఉపనిషదులలో ఈశోపనిషదు ఒకటిగా చెప్పబడినది . ఇందు 18 శ్లోకములు గలవు, ఆత్మసాక్షాత్కారానికుపకరించు చక్కటి వేదాంతమార్గము . ఈగ్రంధాన్ని దాసగణు దేవనాగరినుండి మరాఠీభాషలోనికనువదించినప్పటికీ అందలి లోతైనభావము అతనికి బోధపడలేదు . ఆత్మజ్ఞాని బాబానుజేరి తనసమస్యను వివరించి సరియగు నర్ధము దెలుప వేడుకొన్నాడు , ఆవిషయములో నెట్టికష్టములేదని తిరుగుప్రయాణంలో వీలేపార్లేలోని కాకాసాహెబు పనిపిల్ల యాతని సమస్యపరిష్కరించునని బాబా బదులుపలికారు . అక్కడున్నవారికీబాబామాటలు తమాషాగా తోచాయి . కాని బబామాటల పూర్తిగా విశ్వసించిన దాసగణు వీలేపార్లేజేరి దీక్షితునింట బసజేసాడు. ఆ మరునాడుదయం నిద్రలేచిన గణుకు యొకపనిపిల్ల శ్రావ్యమైన పాటవినిపించింది . ఆబాలిక విషయం ముందుగనే బాబాకెలాతెలిసింది? బాబాసర్వజ్ఞులుగదా! ఆబాలిక పనిమనిషి నామ్యా చెల్లెలు, చింకిగుడ్డలు ధరించిన కడుపేదరాలు . అయినప్పటికీ మిగులసంతోషంతో ఎర్రచీరను వర్ణించెడి చక్కనిపాటను మధురంగా పాడుతుంది. ఆమెపై జాలిపడిన దాసగణు మరునాడు ప్రధాన్ ద్వారా ఆమెకొక చిన్నచీరను బహూకరించాడు . చీరనందుకొన్న పనిపిల్ల మహదానందపడినది . మూడవరోజు కొత్తచీరతో పనికొచ్చిన ఆమె అమితోత్సాహంతో ఆటపాటల నందరి గెలిచింది . మరునాడు మునుపటి చిరుగులతో పనిలోకొచ్చింది, కాని ఆమె సంతోషం , ఉత్సాహం క్రిందటిరోజులా కొనసాగాయి . పనిపిల్ల చర్యలద్వారా దాసగణుకో చక్కని సందేశం మనసున మెదిలింది . వ్యక్తి తనకు లభించిన కర్మలను దైవాజ్ఞగా స్వీకరించి, ఆనందంగా నిర్వహించాలి . కర్మలనెప్పుడు విడువరాదు, సహజానందాన్ని మరువరాదు . భగవంతుడే కర్మఫలదాత . జరుగుకార్యములన్నియు సృష్టికర్త అధీనములు . ఎవరికర్మఫలములు వారివి , ఎదుటివారి ఫలములనాశింపరాదు. ప్రస్తుత విషయంలో పనిపిల్ల జేసెడి పని కర్మయోగంగా తలంచవచ్చును . సంతోషంతో నిర్వహించడం జ్ఞానయోగంగా యోచింపవచ్చును . భగవంతుడు సర్వవ్యాపి . ఆమె ధరించిన పాత వస్త్రము , కొత్తచీర , యిచ్చిన దాత, అందుకొన్న గ్రహీత, దానభావము మున్నగునవన్నీ దేవుని అంశములుగా దాసగణు గ్రహించాడు . జ్ఞానంతో కూడిన కర్మల జేయవలెను , భగవంతుడు సర్వము వ్యాపించియున్నాడు . ఆత్మ సర్వవ్యాపకము , సర్వులను ఆత్మరూపులుగా తలంచవలె,బాధలకు దుఃఖములకు లొంగిపోరాదు !
ఇదేవిషయాన్ని బాబా మజీదులో బోధింపక విలేపార్లేలోని పనిపిల్లద్వారా ఈశోపనిషదుకు భాష్యం చెప్పారు. మాటలతోగాక అనుభవపూర్వకంగా బోధించారు బాబా ! అందులకే సాయిబాబా సమర్ధసద్గురువులు ! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికీ శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
" ఈ ఆత్మ యెప్పటికిని పుట్టునదికాని , మరణమును పొందునది కానికాదు. మఱియు కొంతకాలముండి పిమ్మటలేనిపోవునదికాని,కొంతకాలము లేకుండ పిమ్మట నుండునదికాని కాదు . కావున నీ యాత్మ పుట్టుకలేనిదనియు , నాశములేనిదనియు , సర్వకాలములయందును ఒకేవిధముగా నుండునదనియు ,అనాదియైనదనియు తెలిసికొనుము .కావుననే శరీరము మారిపోవుచున్నప్పటికిని ఈ యాత్మ మారిపోవునదికాదు" భగవద్గీత : 2:20.( " He is not born, nor does He ever die; after having been, He again ceases not to be; Unborn,Eternal,Changeless and Ancient, He is not killed when the body is killed". The Holy Geeta: 2:20 ). " నీకు కర్మమునందే అధికారము , ఎప్పుడును కర్మఫలముల యందాసక్తి కలుగకుండుగాక ! కర్మఫలములకు కారణమైన వాడవుగను గాకుము. సకామ భావముతో కర్మల నాచరింపకుమని భావము . కర్మములు చేయక మానుట యందును నీకు ఆసక్తి గలుగకుండును గాక " . భగవద్గీత : 2:47. ( " The right is to work only, but never to its fruits: let not the fruit-of-action be thy motive, nor let thy attachment be to inaction". The Holy Geeta: 2:47 )
Comments
Post a Comment