శ్రీసాయిసందేశామృతము 21 (Nectar of Sri Sai's message 21).

శ్రీసాయినాథాయనమః ! సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము: అధ్యాయము 21."ఇచటిమార్గము అప్పబోధించు నీతులంత సులభముకాదు . నాన్హేఘాటులో ఎదుబోతుపైన సవారిజేయుటకంటె కష్టము . ఈ ఆధ్యాత్మమార్గము మిగుల కఠినమైనది . దీనికి ఎంతో కృషి అవసరము . అప్పాజెప్పినదంతయు నిజమే ! కాని యవన్నియు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను . ఊరకనే గ్రంధములు చదువుటవలన ప్రయోజనములేదు . గుర్వనుగ్రహములేని పుస్తకజ్ఞానము నిష్ప్రయోజనము." సాయిబాబా వినాయక్ హరిశ్చంద్ర ఠాకూర్ తో అన్నమాటలివి . ఇంతకు పూర్వము ఠాకూర్ వడగాం అను పట్టణాన విచారసాగరమను గ్రంధాన్ని, భక్తులకు బోధించు అప్పాయను కన్నడయోగిని దర్శించినపుడు ఆయోగి వానితో అన్నమాటలు . " ఈపుస్తకమును నీవు చదువవలెను . అందువలన నీకోరికలు నెరవేరును . ముందుముందు ఉత్తరదిక్కునకు పోవునప్పుడు అదృష్టవశమున నీకొక మహాత్ముని దర్శనము కలుగును . వారు నీ భావిమార్గమును జూపెదరు . నీమనసుకు శాంతియానందములు కలుగజేసెదరు. " అప్పాజెప్పిన మాటలు అక్షరసత్యమై ఠాకూర్ బాబాను దర్శించి మిగుల ఆనందభరితుడయ్యాడు . ఇందుమూలమున తెలియువిషయములు , బాబాసర్వజ్ఞత, యోగులు పరస్పర అవగాహనతో తమభక్తులనుద్ధరించు విధానము , మరియు గ్రంథపఠనమె లాజేయాలి యను అంశములు . బాబాయనుమతి లభించినపిమ్మటే దేవు యనుభక్తుడు జ్ఞానేశ్వరి పవిత్రగ్రంధమును చదువగలిగాడు . వేదవేదాంతములు చదివినా మనసు కుదుటబడని అనంతరావు పాటంకర్ బాబానుదర్శించి తనసమస్యను విన్నవించుకున్నాడు . తొమ్మిది ఉండల గుఱ్ఱపు లద్ది కథద్వారా వాని పుస్తకజ్ఞానానికదనంగా నవవిధభక్తులలో ఏదోయొక దానిని కలిగియుండాలని భక్తి ప్రాశస్యాన్ని బోధించారు . భక్తిలేనిజ్ఞానము వాసనలేని పూవులాంటిది . బాబా అశీసులతో యాతడు తృప్తిచెందాడు . ఎచటో దూరాన పండరిక్షేత్రంలో బాబాను విమర్శించిన ప్లీడరు సాయిని దర్శించి ప్రణమిల్లాడు. బాబా అదేవిషయాన్ని ఆతనికి గుర్తుజేసి యిట్లన్నారు , " ప్రజలెంత టక్కరులు? వారు పాదములపై బడెదరు . దక్షిణ నిచ్చెదరు. కానీ చాటున నిందించెదరు . ఇది చిత్రముగదా ! " ఇది చిత్రముగదా ! ప్లీడరు తనతప్పును గ్రహించాడు . ఎవరిని దూషించరాదు , నిందించరాదు, వారివిషయములకలుగజేసికొనరాదనే బాబా ఉపదేశాన్ని గ్రహించాడు . బాబాసర్వవ్యాపి, లోకంలో వారికి తెలియనివిషయం లేదనే సత్యమిచట తేటతెల్లమవుతుంది . బాబానునమ్ముకొన్న భక్తుడు పరులనెలా దూషిస్తాడు ? నిందిస్తాడు ? బాబా తమహస్తములతో విష్ణుసహస్రనామగ్రంధాన్ని శ్యామాకిచ్చి చదివించారు . సంస్కృత భాషనెరుగని శ్యామా శ్రద్ధతో చదివి ఇతర విద్యావంతులకు బోధించెడివాడు . బాబా ఓ సందర్భంలో బూటీని జ్యోతిష్యం చదువమన్నారు . ఆవిషయమై తనకెలాంటి అవగాహన లేకున్నా బాబాపై విశ్వాసంతో చదివి ఆవిద్యలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.