శ్రీసాయిసందేశామృతము 22 (Nectar of Sri Sai's message 22).
శ్రీసాయినాథాయనమః . సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 22. శ్రీసాయిబాబ అష్టోత్తరశతనామావళిలో ఓ నామం ' ఓం మర్త్యాభయప్రదాయనమః ', మరొకనామం ' ఓం భక్తాభయప్రదాయనమః . ' ఈనామముల భావమేమన భక్తుల మృత్యుభయము పారద్రోలు అభయప్రదాతకు ప్రణామములు . ప్రస్తుత అధ్యాయంలో సర్పాలబారినుండి కొందరిభక్తులనెలా బాబారక్షించారను వివరముల స్మరించెదము .కోపర్గాం మామలతదారుగా పనిజేస్తున్న బాలాసాహెబ్ మిరీకర్ చితలీ గ్రామపర్యటనకు పోతూ మార్గమధ్యమమున బాబాను దర్శించాడు . శెలవుతీసుకొని వెళ్ళువానితో బాబా యిలా హెచ్చరించారు , " ఈ మజీదుతల్లి చాల దయార్ద్ర హృదయురాలు . ఆమె నిరాడంబర భక్తులరక్షించేతల్లి. ద్వారకామాయి బిడ్డలను సర్పమేమిచేయగలదు ?' అలా మాట్లాడుతూ శ్యామాను వానితో పంపారు . వారు రాత్రిసమయాన చైతలీ జేరి ఆంజనేయస్వామి ఆలయంలో బసజేశారు. అపుడో సర్పం యాతనిదేహంపై కదలాడింది . అందరు భయభ్రాంతులకు లోనయ్యారు . వెంటనేకొట్టిచంపారు. బాబా యెంతటి కరుణామయులు , సర్వజ్ఞులు ! తోడువెడలిన శ్యామా మిరీకరునకు బాబాసమకూర్చిన రక్షణకవచంగా తలంచవచ్చును . మరొక సందర్భాన గొప్పజ్యోతిష్యుడు ఆరోజు బాపుసాహెబు బూటీకి ప్రాణగండముందని హెచ్చరించాడు . మజీదుదర్శనానికి వెళ్ళినాతనితో బాబా అన్నారు , ' ఈనానా నీకు మరణముందని చెప్పుచున్నాడా ? భయపడవలదు . మృత్యువెలా చంపునో జూచెదముగాక . ' ఆరోజు సాయంకాలం మరుగుదొడ్డికివెళ్ళిన బూటీకి పాము కనపడింది కాని నౌకరు కఱ్ఱదెంచునంతలో మాయమయింది. జ్యోతిష్యుని భవిష్యవాణిని బాబాకృప వమ్ముజేసింది .కోరాలేగాం అమీరు శక్కర్ కీళ్లనొప్పిబాధతో చావడిలో 9 నెలలుండి రోగముక్తుడయ్యాడు . బాబాతో నిదురించుసమయాన ఓ సర్పం చావడిలో కదలాడింది . బాబహెచ్చరికతో దానిని వెంటనే కొట్టిచంపారు . పురాణశ్రవణం జేస్తున్న హేమాడ్ పంతు భుజంపై తేలుకదలక కూర్చుంది, వానికెట్టి యాపద కలుగలేదు . పిదప ఉత్తరీయం మడతలమధ్య తేలునుంచి తోటలో జారవిడిచాడు. మరొకరోజు దీక్షితువాడ కిడికీలో పాముకన్పడిందికాని యెవరికి హానిజరుగలేదు, పిదప మాయమయింది . పైనుదహించిన భక్తుల యనుభవాలు సాయిబాబ సర్వజ్ఞతను , కారుణ్యమును , సమర్ధతను చాటుచున్నవి . శివుడాజ్ఞలేక చీమైనా కుట్టదనునది సామెత ! భక్తులకు బాబాయే శివుడు, వారి యాఙ్ఞయే దైవాజ్ఞ ! " శరణన్న వారల రక్షించుటయే నా ధర్మము ." అన్నబాబామాటలు నిత్యసత్యముగదా ! దిగువ చిత్రము బాలాసాహెబ్ మిరీకర్ .
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి! జైజైసాయి!
" ఏ పరమభక్తులు ఇతర చింతలు లేనివారై, పరమదైవమగు పరమాత్మనగునన్ను ఎల్లప్పుడును ధ్యానించువారై సేవించుచున్నారో, అట్లు సర్వకాలముల యందు సమాహితచిత్తులైన వారియొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను . " భగవద్గీత : 9:22. ( " To those men who worship Me alone, thinking of no other, to those ever self-controlled, I secure for them that which is not already possessed (Yoga) by them, and preserve for them what they already possess(Kshema)." ) The Holy Geeta: 9:22.

Comments
Post a Comment