శ్రీసాయిసందేశామృతము 23.

శ్రీసాయినాథాయనమః. సాయిబాబ తమ శుభసందేశాలనే కిరణాలతో భక్తుల హృదయాల్లో వెలుగులనింపి చైతన్యవంతం చేస్తున్నారు . బాబాసందేశాలనాచరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుందాము.
శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 23. వినమ్రతకు మరోపేరు శ్రీసాయిబాబ. మానుషరూప దైవమైనను తాను అల్లాకు బానిసనని సదా 'అల్లామాలిక్ ' జపంజేసేవారు . భక్తులకిది చెప్పకచెప్పిన బాబ మౌనసందేశము , శాస్త్రజ్ఞానము ఆత్మజ్ఞానముముందు వెలవెలబోవును; ఏలయన శాస్త్రజ్ఞానము మానసికము, ఆత్మజ్ఞానము ఆధ్యాత్మికము! యోగశాస్త్రముల పెక్కుజదివినా సమాధిస్థితి పొందలేని సాధకుడొకడు సాయి సాయముపొంద శిరిడీ వచ్చాడు . ఆసమయంలో ఉల్లితో రొట్టెతిను బాబానుజూసి, ఉల్లితినువాడు తనకష్టములెలా దీర్చగలడని సంశయించాడు . వానిమనసెరిగిన సాయి ఉల్లి జీర్ణించుకోగలవాడే తినగలడని సమీప భక్తుడు నానాసాహెబుతో అన్నారు.సాయి సర్వజ్ఞతకు అబ్బురపడిన సాధకుడు పశ్చాత్తాపంతో బాబాచరణాల వాలి శరణువేడాడు . స్వచ్ఛమైన మనసుతో తనకష్టములు విన్నవించి బాబాసాయం పొందాడు . నమ్మితేసొమ్ము , నమ్ముకుంటే దుమ్ము యనుసామెత గలదు . సన్నిహితభక్తుడు శ్యామావిషయంలో ఈనానుడి రుజువైనది . పాముకరచి ప్రమాదస్థితిలోయున్న శ్యామాను పక్కవారు సమీప విఠోబా గుడికి తీసికెళ్ళ దలచినప్పుడు, యాతడు సమ్మతింపక సాయిరక్షణకై ద్వారకామాయికి పరుగుదీశాడు . కాని బాబావైద్యం బహువింతగదా! ఏదైన మందిచ్చి ప్రాణం కాపాడవలసిన సమయాన మిగులకోపంతో వాని తిట్టారు . శ్యామతనప్రాణంపై ఆసవదలుకొన్నాడు. కాని బాబాకోపమే మందుగా , మాటయే మంత్రంగా పనిజేసి శ్యామా ప్రాణగండం తప్పినది . బాబాపై వానివిశ్వాసం పదింతలైనదిగా భావింపవచ్చును ! మరొక పర్యాయం శిరిడీలో కలరావ్యాధి మిగులప్రబలింది. కలరానిరోధించుటకై గ్రామస్తులు రెండు అత్యవసర నియమాలజేశారు . కట్టెలబండి గ్రామంలోకి రాకూడదనెడిది మొదటి నియమం . కాని బాబా దాన్ని వ్యతిరేకించి బండిని మజీదుకు పంపి కట్టెలకొన్నారు . ధునికై నిత్యం కట్టెలయవసరముంది. బాబాచర్యను వ్యతిరేకించుటకెవ్వరు సాహసింపలేదు . మూఢవిశ్వాసాల నిరసించారు సాయి . శిరిడీలో మేకను కోయరాదనేది గ్రామవాసుల రెండవనియమము. కాని యిది చాదస్తమని బాబాకు తెలియును . ఆసమయంలో యెవరో ఒక మేకను మజీదుకు తెచ్చారు . అపుడు సమీపానున్న అత్యంత అంకిత భక్తులు శ్యామా , బడేబాలను మేకనరకవలసిందిగా కోర , వారిరువు నిరాకరించారు . పిదప బాబా ఆజ్ఞపై బ్రాహ్మణుడైనను మేకను నరక సిద్ధమయ్యాడు కాకాసాహెబు దీక్షితు . కాని వేటువేయుసమయాన వాని నడ్డగించారు బాబ. గుర్వాజ్ఞపాలనకై స్వధర్మాన్ని విడనాడాడు కాకాసాహెబు . అందులకే యాతడు బాబాకు అత్యంత ప్రియభక్తుడయ్యాడు . జీవనయాన పరీక్షల నెగ్గగలవాడే ధీరుడు ! పై ఘటనల ద్వారా రెండు విషయములు బోధపడుచున్నవి; మూఢనమ్మకాల నిశ్వసించాలి, అన్నిసమయాల సద్గురునిపై విశ్వాసం ఇనుమడించాలి! భక్తివిశ్వాసాలే భక్తుని ప్రగతికి కొలమానాలు ! దీక్షితులా పరిపూర్ణ విశ్వాసంతో గురుని సేవించాలనేది సాయిసందేశంగా దలపవచ్చును. దిగువ చిత్రము కాకాసాహెబు దీక్షితు .
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
" సమస్త కర్మములను విడిచి నాన్నొక్కని మాత్రము శరణు బొందుము . నేను నిన్ను సమస్త పాపములనుండి విముక్తిని చేసెదను . సర్వధర్మములనగ బుద్ధ్యాదీన్ద్రియములు, వాటి వ్యాపారములును వాటిని విడిచి తురీయావస్థలో నిలువుము . అచ్చట దుఃఖకారణములు లేవు . కాన శోకింపకుమని యర్ధాంతరము . " భగవద్గీత : 18:66. (Abandoning all Dharmas, (of the body, mind and intellect),take refuge in Me alone; I will liberate thee from all sins;grieve not.) The Holy Geeta: 18:66.

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.