శ్రీసాయిసందేశామృతము 26 (Nectar of Sri Sai Message 26).
శ్రీసాయినాథాయనమః .
శ్రీసాయిసందేశామృతము : అధ్యాయము 26. శ్రీసాయిబాబా బోధలలో గురునిపట్ల భక్తిశ్రద్ధలకు అత్యంతప్రాముఖ్యతగలదు. అందులకు వారిగురుసేవయే ప్రబల నిదర్శనము . పంతు యనుభక్తుడు విరారులోని తనగురుని యనుమతితో శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు . కాని పిమ్మట మూర్ఛవచ్చి నేలపై బడ్డాడు . బాబాదయతో కొద్దిసేపటికి తెప్పరిల్లి కళ్లుతెరచాడు . వానిపూర్వాపరాలెరిగిన సర్వజ్ఞుడు బాబా వానితో ఇట్లాన్నారు." ఏమైనను కానిండు పట్టువిడువరాదు . నీగురునియందే ఆశ్రయము నిలుపుము . ఎల్లప్పుడు నిలకడగా నుండుము . ఎప్పుడు వారిధ్యానమునందే మునిగియుండుము". ప్రస్తుత బోధ బాబా భక్తులెల్లరకు వర్తిస్తుంది . తమనుపూజింపమని బాబాయెన్నడు భక్తుల నిర్దేశింపని విషయం మరువరాదు . బొంబాయి నివాసి హరిశ్చంద్ర పితళే పుత్రుడు నయముగాని మూర్ఛవ్యాధితో బాధపడు కొడుకుతో బాబాను ఆశ్రయించాడు . దయామయుడగు బాబా ఆశీసులతో కొంతసేపటికి కుర్రవానికి స్పృహవచ్చి బాగైనాడు . తండ్రి కృతజ్ఞతతో బాబాను పూజించి అచటివారలకు మిఠాయిలు పంచాడు . ఇంటికివెడలు పితళేకు మూడురూపాయలిచ్చి పూజింపమని జెప్పి, అంతకుమునుపు రెండురూపాయలిచ్చామన్నారు . తొలిసారే వచ్చిన యతనికి రెండురూపాయలిచ్చిన విషయం అర్ధంకాలేదు . ఇంటికెళ్లిన వానికి తన తల్లిద్వారా వాస్తవం తెలిసింది . పూర్వం తండ్రి తనతోపాటు దత్తావతార అక్కల్కోట స్వామినిదర్శించాడు.అపుడాస్వామి తండ్రికి రెండురూపాయలిచ్చి పూజింపమన్నారు . తండ్రిమరణానంతరము పూజ ఆగిపోయినది , రూపాయలు పోయాయి . ఇదేవిషయాన్ని వానికి గుర్తుజేశారు బాబా . ఈఘటనద్వారా సాయిబాబా మరియు స్వామిసమర్థలు వేరుగారనే విషయం బోధపడుతుంది . తల్లిదండ్రుల పూజ బిడ్డలుకొనసాగించాలని సాయి అందరికి గుర్తుజేస్తున్నారు . పితళే యటులే పూజకొనసాగించాడు . మరొకలీలద్వారా బాబా ఈవిషయాన్ని ధ్రువపరచారు . పూనా నివాసి గోపాలరావు నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు . అతడు జీవితంలో అనేక కష్టాలపాలై శిరిడీలో ఓరాత్రి ప్రాణత్యాగం జేయదలచాడు . కాని సాయితలపు వేరు . సమీప హోటల్ యజమాని సగుణమేరు నాయక్ సమయానికచటికొచ్చి అక్కల్కోట స్వామి పుస్తకమిచ్చి చదువమన్నాడు . చదవడానికి పుస్తకం తెరచినవానికి స్వామిసమర్థుల సందేశం కథారూపంగా కనబడింది . ఆత్మహత్యకు పాల్పడిన భక్తునిముందు స్వామి ప్రత్యక్షమై, కర్మఫలం అనుభవించాలని ఆత్మహత్య మహాపాతకమని జెప్పి వానినాప్రయత్నమునుండి విరమింపజేశారు . కథజదివిన అంబాడేకర్ ఆత్మహత్యాప్రయత్నం మానుకొని సాయికృపతో జ్యోతిష్యంలో ప్రావీణ్యతసంపాదించి తనజీవితాన్ని సుఖమయంజేసుకొన్నాడు . తల్లిదండ్రుల ఆస్తులకు బిడ్డలు వారసులు , అటులనే భక్తిశ్రద్ధలకు సయితం వారసులుకావలెను!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !

Comments
Post a Comment