శ్రీసాయిసందేశామృతము 28 (Nectar of Sri Sai's message 28).

శ్రీసాయినాథాయనమః !
సమర్ధసద్గురు సాయిబాబా పిపీలకాది బ్రహ్మపర్యంతము వ్యాపకులు . అంటే భగవద్గీతలో చెప్పబడిన సర్వవ్యాపక ఆత్మయే వారన్నమాట ! ఆత్మకు చావుపుట్టుకలులేవు,పంచభూతములకతీతము . దేహముకన్న మనసుగొప్పది , మనసుకన్నబుద్ధిమిన్న . ఆబుద్దిగూడ ఆత్మచేతనే చేతనత్వమును పొందుచున్నది . సామాన్యమానవుల శక్తియుక్తులు అతిస్వల్పములు . కొందరిది దేహస్థాయి,కొందరిది మనసుస్థాయి , మరికొందరిది బుద్ధిస్థాయి. కాని ఆత్నసాక్షాత్కారము పొందిన మహనీయులు బహుఅరుదు . సాయిబాబా , రామకృష్ణపరమహంస , రమణమహర్షి లాంటి మహనీయులు ఆత్మస్థితిలో విహరించే సమర్ధసద్గురువులు . వారికీ దైవానికి యెలాంటి బేధము కానరాదు . ఆత్మస్థితి అతిబలీయ అయస్కాంతక్షేత్రము . ఆబలిమిచేతనే సాయిబాబా తనభక్తులను అమితంగా ఆకర్షిస్తున్నారు. తనవాడిని తానె తాడుకట్టి పిచ్చుకలా లాగెదనని బాబా స్వయంగా చెప్పారు . సాయిసంకల్పంలేక వారినెవ్వరు దర్శింపలేరు. ప్రస్తుత అధ్యాయంలో బాబా తనవద్దకీడ్చిన కొందరిభక్తుల యనుభవాలు చెప్పబడ్డాయి . మొదటివ్యక్తి లాలా లక్ష్మీచంద్ , బొంబాయినగరంలో ఓ గుమస్తా . 1910వ సంవత్సరంలో వానికి కలిగిన స్వప్నదర్శనం సాయిపిలుపుకు సంకేతం . దాసగణుకీర్తనలో బాబాఫొటో చూడటం, శిరిడీకి వెళ్లదలచడం సాయిసంకల్పం . స్నేహితుడు శంకరరావు పిలవడం , 15 రూపాయలు అప్పుదొరకడం సాయి సహాయం . ప్రయాణంలో సాయినిగూర్చి తోటివారలనడగటం వానిసందేహం . వాని సందేహనివృత్తికై సాయిచేసిన చమత్కారాలెన్నో ? జామపండ్లుకొనాలనే ఆలోచనరాగానే పండ్లనమ్మే ముసలమ్మ తటస్థపడటం , దర్శనానంతరం వాని గతయనుభవాలను, ఆలోచనలను వివరించడం, వానికిష్టమైన సాంజాను ప్రసాదరూపంగా సమకూర్చడం మున్నగునవి. స్వల్పకాలంలో పలుయనుభవాల చవిచూచిన యతడు బాబాకు అంకిత భక్తుడవటంలో ఆశ్చ్యర్యమేముంది ? సాయిసన్నధిజేరిన మరొకపిచ్చుక బరహంపూరు మహిళ. ఆమెను స్వప్నంలో కిచడీకోరి మేల్కొనేలోపు మాయమయ్యారు . పిదప భర్తతోగూడి శిరిడీలో రెండుమాసములుండి సాయికి తృప్తిగా కిచిడీ సమర్పించి సంతసించింది . ఈఘటనలు భక్తులపై సాయిప్రేమకు సాక్ష్యాలు . వీరంగామ్ వాసి మేఘాశ్యాముడు బాబాలాగిన మూడవ పిచ్చుక . అమాయక శివభక్తుడు . ఆతనియజమాని సాఠే ప్రోద్బలంచే శిరిడీకి ప్రయాణమైనా దారిలోనివారిమాటలచే సాయిని మహమ్మదీయునిగా తలచి వారిశక్తిని శంకిచ్చాడు. వానిమనసెరిగిన సర్వజ్ఞుడు సాయి వానితిరస్కరించారు . నాసిక్ నగరంలో కొంతకాలం శివుని సేవించి మారినమనసుతో సాయిని రెండవసారి దర్శించి వారికృపకు పాత్రుడయ్యాడు మేఘా . బాబా ప్రధమనిరాకరణ మేఘాకు శిక్ష మరియు శిక్షణలాంటివి . ఆపై బాబాను శివునిగా నిత్యం పూజించడం వాని పూర్వజన్మసుకృతం . బాబాను శివునిగా దలచి మకరసంక్రాంతిరోజున యభిషేకం చేయడం,కేవలం తలమాత్రమే తడిచి మిగిలిన దేహభాగం పొడిగాయుండటం ఓ విచిత్రలీల . వాడాలో గడియవేసినగదిలో ప్రవేశించి త్రిశూలం గీయమనడం ఓ అద్భుత విషయం . త్రిశూలం గీయగానే పునాభక్తునిద్వారా శివలింగం సమగూర్చడం బాబాచర్యలలోని చతురతకు నిదర్శనం . అదే శివరూపాన్ని వాడాలో దీక్షితు తనధ్యానంలో దర్శిండం మరొక చమత్కారం . మేఘాసేవలో సాయి సాక్షాత్తు శివరూపుడయ్యారు . సాయిసర్వదేవతాస్వరూపులుగదా ! ఇంతటి భాగ్యవంతుడు సాయిసన్నిధిలో తుదిశ్వాసవిడవటం వానిపుర్వజన్మ సుకృతంగా తలచవచ్చును . అందులకే మేఘాను తననిజభక్తునిగ పలికారుబాబా! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
నాయందు చిత్తముగలవాడవును , నాయందు భక్తిగలవాడవును, నన్నేనమస్కరించువాడవు నాగుము. సకలమును నాయందు సమర్పించితివేని , తప్పక నన్నేపొందెదవు . గీత : 18:65.

Comments