శ్రీసాయిసందేశామృతము 49 (Nectar of Sri Sai's message 49)
శ్రీసాయినాథాయనమః !
సాయిబాబా సమర్ధసద్గురువు . తమను పరీక్షింపవచ్చిన అవిశ్వాసభక్తులకు అనుభవములకలిగించి వారిలో విశ్వాసం నింపేవారు . ఈఅధ్యాయంలో బాబాను పరీక్షింపవచ్చిన ఇరువురి భక్తులయనుభవాలు ప్రస్తావించబడ్డాయి . మొదటివ్యక్తి బొంబాయికి చెందిన హరి కానోబా బాబాపై నమ్మకం లేనివాడు . స్నేహితులతో కలసి కొత్తచెప్పులు ధరించి జరీ తలపాగాతో ద్వారకామాయికి జేరాడు . బాబాను దర్శించినపిమ్మట యాతనికి వెలుపల మూలన విడిచిన చెప్పులు కనబడకపోవుటచే మిగుల కలవరపడ్డాడు . వాడికి వెళ్ళిభోంచేసినా చెప్పులగురించే వానిచింత. అంతలో ఆశ్చర్యంగా ఓ బాలుడు పోయిన వానిచెప్పులను కర్రకు వేలాడగట్టి " హరీకా బేటా , జారీకా పేటా " యంటూ అరుస్తూ, తనను బాబాపంపారని ఎవరు హరికా బేటాయో, ఎవరు కొత్తజరీపాగా ధరించాడో చూసి వానికా చెప్పులివ్వమన్నారన్నాడు . ఆశ్చర్యముతో కుర్రవానివద్దకెళ్లి తాను హరియను వాని కొడుకునని మరియు తనుధరించిన కొత్త జరీపాగా చూపించి చెప్పులపొందాడు . పరీక్షింపవచ్చిన వానికే పరీక్షబెట్టి వానిలో విశ్వాసం పెంపొందించారు సాయి, కాని ఏమాత్రం వానిపై కోపగించుకోలేదు . భక్తివిశ్వాసాలతో వెనుదిరిగాడు కానోబా . సోమదేవస్వామి యనుసన్యాసి టాంగాలో బాబాదర్శనమునకై వచ్చాడు . కాని దూరంనుండే మజీదుపై ఎగిరే జండాలజూసి బాబాను దాంభికునిగ భావించాడు . వెనుదిరిగి వెళ్లదలచిన యాతడు తోటి ప్రయాణీకుల మాటలపై సాయిని జూసి మిగుల చిత్తశాంతి పొందాడు . మనసెరిగిన సాయి వానిని పరుషవాక్యాల మందలించారు . బాబా సర్వజ్ఞతను కనులారా జూసిన స్వామి ఆపై భక్తివిశ్వాసాల పెంపొందించుకొన్నాడు . అందరి అంతరంగాలు బాబాకు తెరచిన పుస్తకాలు. సాయిని దర్శింపవచ్చిన బీజాపూర్ మహిళ ముఖసౌందర్యానికి చలించి మరొక్కసారి చూడదలచాడు భక్తుడు నానాసాహెబ్ చాందోర్కర్. సాయి సన్నిధిలో సయితం అలాజరగటం హరిమాయగదా ! వానిమనసుచదివిన బాబా ఓ సందేశమిచ్చారు . చంచల మనసును సాధనతో వశపరచుకోవాలి . వ్యక్తుల అందచందాలనుగాక వారిని సృష్టించిన దైవాన్ని స్మరించి, అనిత్యమైన సౌందర్యం వెనుకనున్న నిత్యమైన దైవరూప ఆత్మను తిలకించాలి . అలా మోహాన్ని జయింపవచ్చు . బాబామాటలు అందరికి వర్తిస్తాయి . పరిశుద్ధమైన అంతఃకరణతోమాత్రమే దైవానుగ్రహం లభిస్తుంది . చిత్తచాంచల్య నిరోధమే యోగముగా చెప్పబడినది . సాయిజూస్తున్నారు ,సాయి వింటున్నారు, తస్మాత్ జాగ్రత జాగ్రత జాగ్రత ! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
Comments
Post a Comment