శ్రీసాయిసందేశామృతము 50 (Nectar of Sri Sai's message 50)
శ్రీసాయినాథాయనమః !
సాయికథలు చెప్పువారు , వినువారు ధన్యులు . ఇవిమాములు కథలుగావు , భక్తుల అంతరంగ అనుభవముల సంపుటములు . ప్రతికథవెనుక ఓ హితముగూర్చెడి సందేశము , బాబాకరుణావీక్షణ రక్షణాలు మిళితమై వుంటాయి.ప్రస్తుత అంతిమ అధ్యాయములో బాబా పరిపూర్ణ యనుగ్రహముపొందిన భక్తుల యనుభవములు చెప్పబడినవి . కాకాసాహెబు దీక్షితు మహారాష్ట్రలోని ఖండ్వా గ్రామమందు బ్రాహ్మణకుటుంబమున జన్మించాడు . వృత్తిపరంగా న్యాయవాది . మిత్రుడు నానాసాహెబ్ చాందోర్కర్ ద్వారా సాయిబాబా ఘనతవిని మిగుల ఆకర్షితుడై తనకాలి కుంటితనంకంటే మనసుకుంటితనాన్ని పోగొట్టుకొనుటకై సాయిని దర్శింపదలచాడు . కేవలం సంకల్పించడమే దీక్షితు వంతు , అదికూడా బాబా సంకల్పమేమోగదా ? ఆపై అహమ్మదాబాద్ లో శ్యామాను కలవడం, ,మేఘాయొక్క బాబాచిత్రపట దర్శనం , క్రిక్కిరిసి రైలులో మిత్రుడు గార్డుగా ఉండటం, కోపర్గామ్ లో రైలుదిగగానే నానాసాహెబ్ ను కలవడం ,గోదావరిలో స్నానముజేసి శిరిడీ జేరడం మున్నగు సంఘటనలు సాయి సమకూర్చిన సదుపాయాలుగావా ? సాయి ప్రదమదర్శనంలోనే పరమానందాన్నిపొందాడు దీక్షితు . ఈ కలయిక 1909వ సంవత్సరములో జరిగినది . పిదప అచిరకాలంలోనే శిరిడీలో నివసించుటకై దీక్షితు వాడ నిర్మించాడు . బాబాకు సర్వస్యశరణాగతిజేసి కేవలం తొమ్మిది సంవత్సరాలకాలంలోనే పెక్కు లెక్కలకందని యనుభూతులపొందాడు . బాబాచెప్పినట్లు 1926 లో హేమాద్రిపంతుతో రైల్లో ప్రయాణంజేస్తూ తుదిశ్వాసవిడిచాడు ఆ ఫుణ్యజీవి. ఎంతకాలం బాబాను సేవించామనడంకంటే, ఎలాంటి శ్రద్ధాభక్తులతో సాయిని కొలిచామనేదే ముఖ్యం . శ్రీవాసుదేవానందస్వామి దత్తభక్తాగ్రగణ్యులు . తనను దర్శింపవచ్చిన పుండలీకరావు నకు ఓ కొబ్బరికాయనిచ్చి భక్తితో బాబాకు సమర్పించమన్నారు . అలాంటి ప్రముఖ స్వాములకుసయితం బాబా పూజ్యులు . మార్గమధ్యలో పుండలీకరావు నారికేళం పగలగొట్టి తినడం, విషయం మరచిన వానిని బాబా అడగటం అన్నీ సాయిసంకల్పాలే ! ఆ సందర్భంలో బాబాచెప్పిన మాటలు సదాస్మరణీయములు . చేసినపనులకు కర్తగా తలువరాదు . దైవనాటకంలో వ్యక్తి కేవలం పాత్రధారిగా భావించాలి . గర్వాహంకారాలకు తావులేదు . అపుడే దైవమార్గం సులభమవుతుంది .బాబాను భక్రిశ్రధ్ధలతో సేవించిన మరొక ధన్యజీవి బొంబాయి న్యాయవాది బాలారాం ధురంధర్ . సద్గ్రంథపఠనం జేసెడి పండరీపుర విఠల భక్తుడు . అతడు సోదరులతోకలసి 1912 లో బాబాను ప్రధమంగా దర్శించాడు . వారిరాకకు ముందే బాబా వారినిగూర్చి పక్కభక్తులకు చెప్పడం బాబా సర్వజ్ఞతకు మరో తార్కాణం . ఈవిషయంతెలిసి వచ్చినసోదరులు మిగుల చకితులయ్యారు . ప్రధమదర్శనంలోనే వారిని మిగుల ఆదరించారు సాయి . వారితో 60 తరాలసంబంధమనడం ఎంత గొప్పవిషయం . ధురంధర్ బాబా పాదాలొత్తడం , బాబానోటి చిలుము త్రాగడం , ఆరు సంవత్సరాల ఉబ్బసవ్యాధి నయమవడం, రాత్రి చావడి ఉత్సవంలో బాబాలో పాండురంగతేజస్సు తిలకించడం తనువుపులకించే యనుభవాలు . ఇన్నివిశేషాలు కేవలం ప్రధమదర్శనపు రోజులోనే జరగడం ఎంతటి విశేషం . ఆలోచిస్తే బాలారాం సాయిభక్తులెల్లరకు మార్గదర్శి . సాయికృపకు కావలసినదంతా మనోవాక్కాయకర్మలన్నింటా సాయి బోధను , మార్గాన్ని రూపాన్ని మనసులో నింపుకోవడం . అలాజేస్తే సాయిసాన్నిధ్యాన్ని సదా అనుభవింపవచ్చు , సర్వహృదయవాసి సాయిగదా ! సాయిజూస్తున్నారు ,సాయి వింటున్నారు, తస్మాత్ జాగ్రత జాగ్రత జాగ్రత ! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
Comments
Post a Comment