సాయి కథలు - అడ్డబల్లపై బాబా శయనం !

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు - అడ్డబల్లపై  బాబా శయనం 

బాబా తమలీలలచే భక్తులకు కొన్నిసందర్భములలో వినోదమును చూపెడివారు. ఓపర్యాయం నానాసాహెబ్ దేంగలే యను భక్తుడు బాబా పరుండుటకై  షుమారు ఐదారు అడుగుల పొడవు, ఎనిమిది లేక  తొమ్మిది అంగుళాల వెడల్పు గలిగిన  చెక్కబల్లను తెచ్చాడు. ఆబల్లను నేలపైనుంచి పరుండుటకు బదులు వింతగా బాబా దానిని మజీదు దూలములకు సన్నని గుడ్డపీలికలతో ఉయ్యలలా కట్టి దానిపై నిదురించ మొదలిడినారు. బలహీనమైన గుడ్డపీలికలు బల్లనుమోయుటయే గగనముకాగా, బాబాసయితము నెట్లు భరించెనో చూచువారలకు మిగుల వినోద  ఆశ్చ్యర్యములకు  కారణమైనది. ఎంతప్రయత్నించినప్పటికీ, బాబా బల్లనెక్కుట , దిగుట  భక్తులు గమనింపలేకపోయారు. ఈవింతలీల జూచుటకు క్రమంగా జనులు తండోపతండాలుగా రావడం మొదలెట్టారు.  కొంతకాలానికి బాబా విసుగుచెంది ఆబల్లను విరిచివేశారు.
ఈపైవిషయమై పతాంజలి యోగ  సూత్రములలోని  మూడవభాగమైన విభూతి పాదములో  వివరియింపబడిన విషయములను  జూచెదము. ఆ వివరణప్రకారముగా ఆకాశతత్వమునుండి జీవుల దేహముదయించినది. యోగి ఈ 'ఆకాశ - దేహ' తత్వాలపై సంయమము ( ధారణ,ధ్యాన,సమాధి మూడింటిని కలిపి సంయమమందురు. మరిన్ని వివరాలకు 'సాయి కథలు -  అక్కచెల్లెండ్ర అనురాగము' 06/29/2019 , చూడగలరు.) సల్పిన ఆతని దేహము దూదివలె బహుతేలికయై  ఆకాశమునకెచటికైనను సులువుగా వెళ్లగలడు. ఆకాశతత్వానికి బరువుండదు గనుక యోగి పూర్తిగా భారరహితుడవుతాడు. సాయిబాబా యోగిరాజు గావున పైన చెప్పబడిన లీలను మిగుల సునాయాసంగా చూపగలిగారు. మరియొక ముఖ్యవిషయమేమంటే  సాయిబాబా కేవలము యోగ విద్యయందే పరిపూర్ణులుగాక ఆత్మసాక్షాత్కారమును సిద్ధింపజేసుకొన్న సద్గురుమూర్తులు. వారికి అష్టసిద్ధులు, నవనిధులు సహజముగనే సిద్ధించినవి.

సిద్ధులు ప్రదర్శించుటకు వారు ఎలాంటి సంయమము, ప్రయత్నము  జేయ నవసరములేదు. కేవలము తమసంకల్పమాత్రమున బరువులేక బల్లపై నలుమూలల దివ్వెలుంచి భక్తుల వినోదపరస్తూ  నిదురించారు. 

లీలకాదదె ఫలక విలోలనిదుర
     నాల్గుమూలల దివ్వెల నేర్పునిలిపి
     భక్తులెల్లర బరువుల మోయుతండ్రి
                బాబ శయనము సాగె బరువులేక             

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్ధ  సద్గురు శ్రీసాయినాథమహారాజులకు శతకోటి వందనములు, జేజేకారములు !  

శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 

Comments

  1. ఆత్మసాక్షాత్కార విద్యయందు అసమానులు సాయినాథులు, అష్టసిద్ధులు, నవనిధులు కొరకనే సాయినాశ్రయించాయి!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)