సాయి కథలు - అడ్డబల్లపై బాబా శయనం !
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - అడ్డబల్లపై బాబా శయనం
బాబా తమలీలలచే భక్తులకు కొన్నిసందర్భములలో వినోదమును చూపెడివారు. ఓపర్యాయం నానాసాహెబ్ దేంగలే యను భక్తుడు బాబా పరుండుటకై షుమారు ఐదారు అడుగుల పొడవు, ఎనిమిది లేక తొమ్మిది అంగుళాల వెడల్పు గలిగిన చెక్కబల్లను తెచ్చాడు. ఆబల్లను నేలపైనుంచి పరుండుటకు బదులు వింతగా బాబా దానిని మజీదు దూలములకు సన్నని గుడ్డపీలికలతో ఉయ్యలలా కట్టి దానిపై నిదురించ మొదలిడినారు. బలహీనమైన గుడ్డపీలికలు బల్లనుమోయుటయే గగనముకాగా, బాబాసయితము నెట్లు భరించెనో చూచువారలకు మిగుల వినోద ఆశ్చ్యర్యములకు కారణమైనది. ఎంతప్రయత్నించినప్పటికీ, బాబా బల్లనెక్కుట , దిగుట భక్తులు గమనింపలేకపోయారు. ఈవింతలీల జూచుటకు క్రమంగా జనులు తండోపతండాలుగా రావడం మొదలెట్టారు. కొంతకాలానికి బాబా విసుగుచెంది ఆబల్లను విరిచివేశారు.
సిద్ధులు ప్రదర్శించుటకు వారు ఎలాంటి సంయమము, ప్రయత్నము జేయ నవసరములేదు. కేవలము తమసంకల్పమాత్రమున బరువులేక బల్లపై నలుమూలల దివ్వెలుంచి భక్తుల వినోదపరస్తూ నిదురించారు.
లీలకాదదె ఫలక విలోలనిదుర
నాల్గుమూలల దివ్వెల నేర్పునిలిపి
భక్తులెల్లర బరువుల మోయుతండ్రి
బాబ శయనము సాగె బరువులేక
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్ధ సద్గురు శ్రీసాయినాథమహారాజులకు శతకోటి వందనములు, జేజేకారములు !
ఆత్మసాక్షాత్కార విద్యయందు అసమానులు సాయినాథులు, అష్టసిద్ధులు, నవనిధులు కొరకనే సాయినాశ్రయించాయి!
ReplyDelete