సాయి కథలు - విజయదశమి, సీమోల్లంఘనము

శ్రీసాయినాథాయనమః 

" నేనే జగన్మాతను ! " సాయిబాబా
పాఠకమహాశయులకు విజయదశమి శుభాకాంక్షలు!  

సాయి కథలు -  విజయదశమి, సీమోల్లంఘనము
" మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి చరిత్రము 

నేడు విజయదశమి,  పవిత్రమైన పర్వదినము  విజయానినికి, వేడుకలకు సంకేతము. సీమోల్లంఘనమనగా సీమ హద్దులదాటి వెడలి  విజయంతో మరలి వచ్చుట. విజయదశమినాడు బాబా మహాసమాధి చెందిన విషయం అందరికీ తెలిసినదే. ఆరోజున బాబా తమదేహ సరిహద్దులదాటి ఎచటికో వెళ్లి మరలా సదా చైతన్యవంతులై , జాగరూకులై  మరణంపై గెలుపునొంది తమభక్త హృదయసీమలలోకి ప్రవేశిస్తున్నారు.  ఈరోజువరకు సాయిభక్తులకు నిత్యం కలిగే యనుభవాలే యిందులకు నిదర్శనము.

 విజయదశమి శుభసందర్భమున శ్రీ సాయి జీవితచరిత్రలో చెప్పబడిన సీమోల్లంఘన వివరములు స్మరించుకొని బాబా ఆశిస్సులు పొందెదముగాక!  1916వ సంవత్సరము విజయదశమి సాయంత్ర  సమయాన  పెక్కుమంది శిరిడీ గ్రామప్రజలు సామూహికంగా పూజాద్రవ్యాలు తీసుకొని ,  మేళతాళాలతో ఊరి పొలిమేరకువెళ్ళి సీమోల్లంఘనము పూజజేసి వస్తున్నారు. రాజులు పూర్వం ఆరొజు దిగ్విజయానికి బయలుదేరి పొలిమేరలు దాటేవారని చెబుతారు. ప్రజలు తమతమ గత ద్వేషభావాలమరచి, పరస్పర మైత్రి పెంపొందించుకొంటారు. సీమోల్లంఘనముజేసి  అందరూ తిరిగివచ్చుచుండగా సాయిబాబా మిగుల కోపితులై  తమ తలరుమాలు, కఫ్ని , లంగోటా తీసి ధునిలో విసరివేసి నిప్పుకణాల లాంటి కళ్ళతో ద్వారకామాయిముందు దిగంబరులై  నిలబడ్డారు.   దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు. " మూర్ఖులారా! నేను హిందువునో  ముస్లింనో యిపుడు తేల్చుకోండి. "  యంటూ మిగుల కేకలేశారు. భయపడి అందరూ నలుచెరగులా  పరుగులెత్తారు. తుదకు కుష్టురోగి భాగోజీ ధైర్యంజెసి వారి నడుముకు లంగోటాచుట్టి, " బాబా శుభమాయని  సీమోల్లంఘనం జరుగుతుంటే  మీరేల భక్తుల భయపెడుతున్నారు? " అన్నాడు.  కాని సాయిబాబా సట్కా నేలకేసి కొడుతూ,  " ఈదినమే నాసీమోల్లంఘనం! " అని కేకలేశారు. ఆమాటలెవరికీ అర్ధం కాలేదు. ఆరోజు చావడి ఉత్సవం జరుగదని భక్తులు తలచారు.  కాని కొంతసేపటికి బాబా శాంతించి, బట్టలు ధరించి తమ ఆసనంపై కూర్చున్నారు. రాత్రి 11 గంటలకు జరిగిన చావడి ఉత్సవంలో మామూలుగా పాల్గొన్నారు.  ముందుగా   సూచించిన ఆవిధంగా 1918 విజయదశమి రోజున   బాబా  తమ భౌతికదేహరూప సీమదాటి అనంతవ్యాపక నిర్గుణ దివ్యరూపం ధరించి తమభక్తుల నుద్ధరిస్తున్నారు.  సమర్ధ సద్గురు శ్రీసాయినాథ్ మహారాజ్ కు మిగుల జయజయ కారాలు పలికెదము!

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 

Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like.  ( మీ సలహా  మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో  పంచుకోండి. ) 


Comments

  1. విజయదశమి సంకల్పం, " మంచిని పెంచుదాం - మనసుల గెలుచుదాం! "

    ReplyDelete

Post a Comment